సిరిసిల్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్
- రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఉత్తర్వులు జారీ
- నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు అందించడమే లక్ష్యం విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల24సెప్టెంబర్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్(Young India Integrated School) సిరిసిల్లకు మంజూరైంది. రూ.200 కోట్ల అంచనా వ్యయంతో పాఠశాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
సిరిసిల్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కి ఆది శ్రీనివాస్‌తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆధునిక వసతులతో విద్యాభ్యాసం
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు డిజిటల్ తరగతి గదులు, ఆధునిక సైన్స్ ల్యాబొరేటరీలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ సదుపాయాలు, క్రీడా వసతులు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు, క్రీడా ప్రతిభను పెంపొందించేలా విద్యా వాతావరణాన్ని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యా వాతావరణం కల్పించడమే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు సమాన విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.