ఉపసర్పంచ్ పై దాడిని ఖండించిన రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం

24-11-2026 | 07:46pm

రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలి.. లేకుంటే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేస్తాం..

కోనరావుపేట నవంబర్ 24 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం బవుసాయిపేట గ్రామంలో ఉపసర్పంచ్ తిక్కల నవీన్‌పై గ్రామపంచాయతీ బాడీ మీటింగ్‌లో జరిగిన దాడి ఘటనను తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం(Telangana Deputy Sarpanches Forum) అధ్యక్షుడు బొట్ల కార్తీక్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం బవుసాయిపేట గ్రామానికి చేరుకున్న ఆయన నవీన్‌ను పరామర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బొట్ల కార్తీక్ మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ కార్యక్రమం సందర్భంగా గ్రామపంచాయతీలో సర్పంచ్ భర్త షేక్ ఫిరోజ్ పాషాను అధికారుల సమక్షంలో కూర్చోబెట్టడం, అదే సమయంలో డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఇతర అధికారులు నిలబడి ఉండటం వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు.గ్రామపంచాయతీ బాడీ మీటింగ్‌కు సర్పంచ్ భర్త ఏ హోదాలో హాజరవుతున్నారని ప్రశ్నించారు. గ్రామ అభివృద్ధి పనులు, నిధుల ఖర్చులపై ఉపసర్పంచ్ ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని, అలా కాకుండా భౌతికంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు.

ఉపసర్పంచ్ తిక్కల నవీన్ సర్పంచ్ పదవిని తొలగించాలని ఎక్కడా ఫిర్యాదు చేయలేదని, గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజా సమస్యలను పరిష్కరించాలని మాత్రమే ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ప్రజల తరఫున ప్రశ్నించడం ప్రజాప్రతినిధిగా ఆయన బాధ్యత అని, అలాంటి వ్యక్తిపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.ప్రజాప్రతినిధుల సమావేశంలోనే ఒక ఉపసర్పంచ్‌పై దాడి జరగడం అత్యంత బాధాకరమని, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచివి కావని అన్నారు.

సర్పంచ్ షేక్ యాస్మిన్‌తో పాటు ఆమె భర్త షేక్ ఫిరోజ్ పాషా రెండు రోజుల్లో ఉపసర్పంచ్ తిక్కల నవీన్ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని బొట్ల కార్తీక్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా ఉపసర్పంచులు, సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి అధికారికంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.ఉపసర్పంచుల గౌరవం, హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం ఉపసర్పంచుల ఫోరం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బొట్ల కార్తీక్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు