నల్లమల్లకు ఆధ్యాత్మిక, పర్యాటక శోభ
- మద్దిమడుగులో రూ.100 కోట్లతో సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం.. రూ.20 కోట్లతో ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి
- 26న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన.. అచ్చంపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
- రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు
అచ్చంపేట, నవంబర్ 24 (విజయక్రాంతి): నల్లమల్ల అటవీ(Nallamala Forest) ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగా ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు(Development programs) చేపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తెలిపారు.
మద్దిమడుగులో రూ.100 కోట్లతో దేశవ్యాప్తంగా లంబాడీ గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం, భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.20 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి మద్దిమడుగు సందర్శించారు. సభా ప్రాంగణం, రాకపోకల మార్గాలు, పార్కింగ్, భద్రత, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులతో సమీక్షించారు. సీఎం పర్యటనకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
రూ.38 కోట్ల పనులకు తొలి విడత శంకుస్థాపన
మద్దిమడుగులో రూ.100 కోట్ల వ్యయంతో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం, భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. తొలి విడతలో రూ.38 కోట్ల పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. నిర్మాణాలు పూర్తయితే మద్దిమడుగు రాష్ట్రస్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గుర్తింపు పొందుతుందని, భక్తులు, గిరిజనులు, పర్యాటకుల రాక పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంజనేయస్వామి ఆలయానికి రూ.20 కోట్లు
మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.20 కోట్లతో వివిధ పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం, అవసరమైన మౌలిక వసతులు సమకూర్చడం లక్ష్యమన్నారు. ఈ పనులకు కూడా 26న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
అచ్చంపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అచ్చంపేట పట్టణంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జూపల్లి తెలిపారు. మహిళల గౌరవం, ఆత్మగౌరవం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, గతంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్త కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
అచ్చంపేట నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. రైతాంగానికి సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. సాగునీటి వసతులు మెరుగుపడితే వ్యవసాయ ఉత్పత్తులు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. విద్య, వైద్యం, రహదారులు, సాగునీరు వంటి రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
భారీ సభకు ప్రజలకు పిలుపు
ఈ నెల 26న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలు, దేవరకొండ నియోజకవర్గ ప్రజలు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలు మద్దిమడుగు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.