తెలంగాణలో తొలి ప్రభుత్వ పాఠశాల రోబో టీచర్
గీతానగర్ జెడ్పీహెచ్ఎస్లో వినూత్న ప్రయోగం తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడిన రోబో
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబో టీచర్(Humanoid Robot Teacher) అందుబాటులోకి వచ్చింది. సిరిసిల్లలోని గీతానగర్ జెడ్పీహెచ్ఎస్(Geethanagar ZPHS)లో నిర్వహించిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశంలో రోబో టీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద విద్యార్థుల విద్యా ప్రగతి, వారి అభ్యసన సామర్థ్యాలపై తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలు, చదువులో పురోగతి, భవిష్యత్ ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోబో టీచర్ ప్రత్యేక కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు రోబో నేరుగా సమాధానాలు ఇచ్చింది. విద్యార్థుల చదువు, భవిష్యత్ అవకాశాలపై అడిగిన సందేహాలను కూడా రోబో వివరించింది. దీంతో తల్లిదండ్రులు ఆసక్తిగా రోబోతో మాట్లాడారు. ఈ రోబో టీచర్ను ఇండస్ ల్యాబ్స్ సంస్థ గీతానగర్ ప్రభుత్వ పాఠశాలకు అందజేసింది.
ప్రభుత్వ పాఠశాలలో హ్యూమనాయిడ్ రోబో టీచర్ను ప్రవేశపెట్టడం తెలంగాణలో ఇదే తొలిసారిగా పేర్కొంటున్నారు. విద్యార్థులకు చిన్న వయసు నుంచే కృత్రిమ మేధస్సు (AI), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంతో పాటు, బోధనను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఇది ఒక వినూత్న ప్రయత్నంగా నిలిచింది.