సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి
రుద్రంగి,(విజయక్రాంతి): సెప్టెంబర్ 30న సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొనే భారీ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహిస్తున్నామని ప్రజలుపాల్గొని విజయవంతం చేయాలి. ఈ నెల 30 తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా గురువారం రుద్రంగి మండల కేంద్రంలో సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Government Whip Aadi Srinivas) ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు భవిష్యత్‌లో ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగించాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి సభ ప్రకటనతో బీఆర్‌ఎస్‌లో ఆందోళన మొదలైందని విప్ అన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సిరిసిల్ల చేనేత రంగానికి, వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులకు, జిల్లా అభివృద్ధికి చేసిన కృషిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి సభతో సిరిసిల్లలో రాజకీయంగా కొత్త చర్చ ప్రారంభమవుతుందని, కేటీఆర్ రాజకీయ పతనం సెప్టెంబర్ 30 నుంచి మొదలవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్, కేసీఆర్ రాజన్న సన్నిధికి వచ్చి గతంలో ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఫామ్‌హౌస్ సంస్కృతిని బీఆర్‌ఎస్ తీసుకొచ్చిందని ఎర్రవెల్లి, రంగనాయకసాగర్, జన్వాడ తదితర ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌ల అంశాన్ని ప్రస్తావించారు. 22ఏ భూముల అంశంలో పేదలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
22ఏ జాబితాలో ఉన్న పేదల ఇళ్లకు పట్టాలు ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సిరిసిల్లలో భూముల వ్యవహారంపై తమ వద్ద ఉన్న అంశాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని చెప్పారు.సభకు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేలా గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ గ్రామానికి ఎన్ని బస్సులు అవసరమో ముందుగానే తెలియజేస్తే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రజలను సమీకరించడంతో పాటు వివిధ సామాజిక, రాజకీయ వర్గాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకుల సమన్వయంతో సభను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ,మార్కెట్ చెర్మన్ చేలుకల తిరుపతి,ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్,మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్, కోమిరే శంకర్,గట్ల మీనయ్య, తూమ్ జలపతి వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.