‘సర్’నోటీసులకు స్పందించని ఓటర్లు

24-09-2026 | 05:20am
  1. హియరింగ్‌కు సగానికి పైగా దూరం 
  2.    5,74,464 మంది మాత్రమే విచారణకు హాజరు 
  3. రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోనే....

మేడ్చల్, సెప్టెంబర్ 2౩ (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(Special Summary Revision of the Electoral Roll) (సర్) లో భాగంగా ఎన్నికల సంఘం(Election Commission) ఇచ్చిన నోటీసులకు జిల్లాలో ఓటర్లు సరిగా స్పందించడం లేదు. జిల్లాలో 574464 మంది మాత్రమే నోటీసులకు స్పందించి హియరింగ్ కు హాజరయ్యారు.773250 మంది హియరింగ్ కు హాజరు కాలేదు.39742 మందిరి షెడ్యూల్ కు దరఖాస్తు చేసుకున్నారు.

విచారణకు హాజరుకాని 773250 మంది ఓటర్లు రీ షెడ్యూల్(Voters Rescheduled) కు దరఖాస్తు చేసుకొని విచారణకు హాజరు కావాలి. లేకుంటే ఓటరు జాబితా నుంచి వీరి పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఫలితంగా జిల్లాలో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గనుంది. నోటీసులకు స్పందించని వారి సంఖ్య రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే ఉంది. 

స్పందించక పోవడానికి అనేక కారణాలు 

ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు ఓటర్లు స్పందించక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొందరికి ఇంతవరకు నోటీసులు అందకపోవడం, నోటీసులు అందుకున్న వారి కి గుర్తింపు కార్డులు అందుబాటులో లేకపోవడం, హియరింగుకు తేదీ నిర్ణయించి హాజరుకావాలని సూచించడం తదితర కారణాల వల్ల ఓటర్లు స్పందించడం లేదని తెలుస్తోంది. కొంతమంది ఓటు కాపాడుకోవాలని తాపత్రయం ఉన్నప్పటికీ నిబంధనలు ఇబ్బందికరంగా మారాయి. ఇటీవల కాలంలో ప్రతిదానికి గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నారు. ప్రజలు దీనిని ఎల్లప్పుడూ అందుబాటులో పెట్టుకుంటున్నారు.

సర్ ప్రక్రియకు ఆధార్ కార్డు పనిచేయడం లేదు. 11 రకాల కార్డులలో ఒకటి తీసుకెళ్లాలి. కొన్నిచోట్ల రెండు మూడు గుర్తింపు కార్డులు అడుగుతున్నారు. వీటికోసం వెతకాల్సిన పరిస్థితి ఉంది. అంతేగాక హియరింగ్ కు ప్రత్యక్షంగా హాజరుకావాలని నిబంధన ఉంది. హియరింగ్ కు అధికారులు చెప్పిన తేదీలలోనే వెళ్లాలి. ఆరోజు ఓటర్లకు ఏదో పని ఉంటుంది. కొంతమంది దూరప్రాంతాలలో ఉన్నారు. నిర్ణీత తేదీలలో రావాలంటే ఓటర్లకు ఇబ్బందికరంగా తయారయింది. గడువులోగా ఏ రోజైనా హియరింగ్ కు రావాలంటే ఓటర్లు వీలు చూసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. 

గణనీయంగా తగ్గనున్న ఓటర్లు 

జిల్లాలో గతంలో 2979310 మంది ఓటర్లు ఉండేవారు. సర్ లో భాగంగా 1907564 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా రూపొందించారు. ఇందులో 1407349 మందికి తప్పులు ఉన్నాయని హియరింగ్ కు హాజరుకావాలని నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. వీరందరికీ అర్హత ఉంది. కానీ వివిధ రకాల ఇబ్బందుల వల్ల హియరింగ్ కు హాజరు కాలేకపోతున్నారు. 

నియోజకవర్గాల వారీగా....

మేడ్చల్ నియోజకవర్గంలో 296596 మంది ఓటర్లకు నోటీసు అందజేయాలని నిర్ణయించగా, కేవలం 216957 మందికి మాత్రమే నోటీసులు ఇచ్చారు.79720 మందికి ఇంతవరకు నోటీసులు అందలేదు. నోటీసులు అందుకున్న వారిలో 120270 మంది మాత్రమే హియరింగ్ కు హాజరై ధ్రువపత్రాలు సమర్పించి ఓటును కాపాడుకున్నారు.174215 మంది నిర్నిత తేదీలలో విచారణకు హాజరు కాలేదు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో 213148 మందికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించగా 174220 మందికి నోటీసులు ఇచ్చారు.

38921 మందికి నోటీసులు అందలేదు.109655 మంది హియరింగ్ కు హాజరు కాగా 102280 మంది గైర్హాజరయ్యారు. కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో 375510 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించగా, 317057 మంది ఓటర్లకు మాత్రమే నోటీసులు అందాయి.56451 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వలేదు.141004 మంది ఓటర్లు హియరింగ్ కు హాజరు కాగా, 231189 మంది ఓటర్లు గేర్ హాజరయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా హియరింగ్ కు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ మంది దూరంగా ఉన్నారు.

కూకట్పల్లి నియోజకవర్గం లో 256776 మంది ఓటర్లకు నోటీసు జారీ చేయాలని నిర్ణయించగా, 231274 మంది ఓటర్లకు మాత్రమే నోటీసులు ఇచ్చారు.25499 మంది ఓటర్లకు ఇంతవరకు నోటీసులు అందలేదు.87080 మంది ఓటర్లు హియరింగుకు హాజరు కాగా, 126838 మంది ఓటర్లు హియరింగ్ కు గైరహాజరయ్యారు.

ఈ నియోజకవర్గంలో 39451 మందు ఓటర్లు తేదీ రీ షెడ్యూల్ చేసుకున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో 267319 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించి 203664 మందికి నోటీసులు ఇచ్చారు.63589 మంది ఓటర్లకు ఇంతవరకు నోటీసు ఇవ్వలేదు.116455 మంది ఓటర్లు హియరింగ్ కు హాజరుకాగా, 138728 మంది ఓటర్లు గైర్హాజరయ్యారు.

మరిన్ని వార్తలు