చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రి
- రూ.45 కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన.. నూతన ప్రభుత్వ సంగీత కళాశాల ప్రారంభం
- 4,668 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్లు..
మంథని, నవంబర్ 24(విజయ క్రాంతి): రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఈనెల 25వ తేదీ బుధవారం మంథని, మహాదేవపూర్, కాటారం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్లు, కల్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు.
మంథనిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఉదయం 9 గంటలకు మంథని మున్సిపాలిటీ పరిధిలోని సత్యసాయి టెంపుల్ వద్ద కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులు రూ.15 లక్షలతో పునరుద్ధరించిన నూతన ప్రభుత్వ సంగీత కళాశాలను మంత్రి ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రూ.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ) నిర్మాణానికి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించనున్నారు.
ఉదయం 10 గంటలకు మంథని గంగాపురిలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో మంథని మున్సిపాలిటీతోపాటు మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్, పాలకుర్తి మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన 2,464 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను అందజేస్తారు. అదేవిధంగా నాలుగు మండలాలకు చెందిన 200 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు, 117 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు.
మహాదేవపూర్‌లో నూతన కార్యాలయాల ప్రారంభం
మధ్యాహ్నం 2 గంటలకు మహాదేవపూర్‌లో రూ.65 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
కాటారంలో పింఛన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
సాయంత్రం 4 గంటలకు కాటారం బీఎల్‌ఎం గార్డెన్స్‌లో కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్‌రావు, పలిమెల ఐదు మండలాల పరిధిలోని గ్రామాలకు చెందిన 2,204 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లను అందజేస్తారు. అలాగే ఐదు మండలాలకు చెందిన 73 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేయనున్నారు.
ఒకే రోజు మూడు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు వేలాది మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించేందుకు మంత్రి పర్యటన కొనసాగనుంది.