పత్తి పంటకు కూలీల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న
బోథ్. నవంబర్ 23 (విజయక్రాంతి): పత్తి పంటను సాగు చేస్తున్న రైతన్న(Cotton Farmers)కు కూలీలు దొరకక తీరా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం పత్తి పంట చేతికి వచ్చే దశలో ఉన్న కూలీలు దొరకకపోవడంతో చేలలోని పత్తి చెట్లపై ఉండడం జరుగుతున్నది. ఏడాది వర్షపాతం పరిస్థితుల వల్ల పత్తి పంట దిగుబడి అంతంత మాత్రమే ఉండడం మరోవైపు పత్తి ఏరేందుకు కూలీలు దొరకకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
మహారాష్ట్ర కూలీల రాక కోసం...
ఆదిలాబాద్ జిల్లా ను ఆనుకొని మహారాష్ట్ర ఉండడం మహారాష్ట్ర కూలీలు ఉపాధి కోసం ఇక్కడికి ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి తలమడుగు. బజార్హత్నూర్, నేరడిగొండ, సోనాల, బోత్, మండలాలకు ప్రతిరోజు ఆటోలలో కూలీలు వస్తున్నారు. అయితే పంట సాగు అధికంగా ఉండడం వచ్చే కూలీలు తక్కువగా ఉండడంతో రైతులు సకాలంలో పత్తి పంటను ఏడిపించడం లేదు. దీంతో పత్తి ఇంటికి చేరకపోవడంతో పత్తి సాగు చేస్తున్న తెల్ల బంగారం రైతన్న తెల్లబోతున్నాడు.
కూలీలు దొరకక ఇబ్బందులు పడుతున్నాం...
పత్తి ఏ రేందుకు కూలీలు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రైతు పురుషోత్తం రెడ్డి వాపోయారు. పత్తి పంట సాగు ఎక్కువగా ఉండడం కూలీలు తక్కువగా ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులే కూలీ రేట్లు పెంచి మహారాష్ట్ర కూలీలను తమ చేలలోకి తీసుకు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. మరోవైపు మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర ఉండటంతో కూలీలు సైతం ధర పెంచి కూలి చెల్లించాలని అడుగుతున్నారని పేర్కొన్నారు.
కిలో పత్తి ఏరితే మొదట తొమ్మిది రూపాయలు ఇవ్వడం జరిగిందని అయితే ప్రస్తుతం 12 రూపాయల కంటే తక్కువ కూలి తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర కూలీల రాక కోసం ఉదయం నుండి మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో వేచి ఉండాల్సి వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా సకాలంలో కూలీలు దొరకక పొలాలలోనే చెట్లపై పత్తి ఉండిపోతుందని అంటున్నారు.