భూ భారతి రీసర్వేపై గ్రామస్తులకు అవగాహన

23-10-2026 | 02:46pm
  1. భూ రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వమే లక్ష్యం
  2. కేశనపల్లి లో రైతులకు అవగాహన లో తాసీల్దార్ మధుసూదన్ రెడ్డి

ముత్తారం, అక్టోబర్ 23 (విజయ క్రాంతి) పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో భూ భారతి రీసర్వే కార్యక్రమంపై(Keshanpalli Land Resurvey) గ్రామస్తులకు శుక్రవారం తాసీల్దార్ మధుసూదన్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూముల పునఃసర్వే విధానం, భూముల హద్దుల గుర్తింపు, భూ రికార్డుల సవరణ, పట్టా పాస్‌బుక్‌ల ప్రాముఖ్యతపై గ్రామస్తులకు వివరించారు.

భూ భారతి రీసర్వే ద్వారా భూములకు సంబంధించిన వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డుల్లో ఉన్న వివరాలతో సరిపోల్చుకోవడం ముఖ్యమని తెలిపారు. భూ యజమానులు తమ భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, విస్తీర్ణం, హద్దులు, ఇతర వివరాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. భూ రికార్డుల్లో ఏవైనా తప్పులు లేదా వ్యత్యాసాలు గుర్తించినట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

భూములకు సంబంధించిన రికార్డుల్లో పారదర్శకత, కచ్చితత్వం సాధించడం, భవిష్యత్తులో భూ వివాదాలను తగ్గించేందుకు అవసరమైన సమాచారాన్ని సరిచూసుకోవడం రీసర్వే ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు చురుకుగా పాల్గొని తమ భూములకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెగూడ తిరుమల, ఉపసర్పంచ్ సదయ్య, సర్వేయర్లు, సంబంధిత అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు