మాజీ మంత్రి హరీశ్ రావును కలిసిన బీఆర్ఎస్ నేతలు​

23-10-2026 | 03:38pm

రంగారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ఫుడ్ కమిషన్  చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు శుక్రవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండుగ సందర్భంగా హరీశ్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం, నియోజకవర్గంలో పార్టీ బలోపేతం మరియు తాజా రాజకీయ పరిణామాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

​ఈ భేటీలో కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని తాజా రాజకీయ పరిస్థితులు, గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతున్న కరెంటు కోతలు, పంట కొనుగోళ్లు,  విత్తనాలు-ఎరువుల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై హరీశ్ రావు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, ప్రజా సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరంతరం ఎండగట్టడంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండాలని సూచించారు. ​త్వరలో జరగనున్న పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికలపై హరీశ్ రావు నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ​పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ పట్టభద్రుల ఓట్ల నమోదు వేగవంతం చేయాలని తెలిపారు.

క్షేత్రస్థాయిలో గులాబీ జెండా బలాన్ని చాటుతూ, బీ ఆర్ ఎస్ అభ్యర్థి ని భారీ మెజార్టీతో గెలిచేలా ప్రతి ఒక్కరూ శ్రమించాలని పిలుపునిచ్చారు.​ఈ సమావేశంలో కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ  సత్యం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, వైస్ చైర్మన్ గంప గోవర్ధన్, వెల్దండ మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ దశనాయక్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ సభ్యుడు కృష్ణారెడ్డి,మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు