టేకులపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
టేకులపల్లి, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ(District Medical and Health Department) అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ టేకులపల్లి మండలం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవలను పరిశీలించారు. గర్భిణుల ప్రసవ అంచనా తేదీల (ఈడీడీ) క్యాలెండర్, ఓపీ రిజిస్టర్లు, సిబ్బంది హాజరు పట్టికలను తనిఖీ చేసి రికార్డుల నిర్వహణను సమీక్షించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీకి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, ప్రసవ అంచనా తేదీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ తనిఖీలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సుందర్‌తో పాటు పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.