మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

23-10-2026 | 03:12pm

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్

కామారెడ్డి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు.  శుక్రవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించిన మొక్కలకు నీరు పోసే కార్యక్రమంలో వన మహోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్  మొక్కలకు నీరు పోశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, నాటిన ప్రతి మొక్కను సంరక్షించి,

అది ఆరోగ్యంగా పెరిగేలా చూడటం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందిస్తూ, అవి ఎండిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ దామోదర్ రెడ్డి , మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్, ఎంపీడీవో నాగేశ్వర్, తహశీల్దార్ ఉమలత, పంచాయితీ రాజ్ ఏ ఈ సురేష్, ఆర్ డబ్ల్యు ఎస్ ఏ ఈ విష్ణువర్ధన్, ట్రాన్స్కో ఏ ఈ సుధాకర్, ఏపీ ఓ ధర్మారెడ్డి సర్పంచ్ కిషన్ యాదవ్ , ఉప సర్పంచ్ మధుకర్, పంచాయతీ కార్యదర్శి పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు