ఎల్‌నినో ప్రభావంపై రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి...
- బాన్సువాడ ఆర్డీఓ అడ్లా రవీందర్ రెడ్డి...
బాన్సువాడ, అక్టోబర్ 23 (విజయ క్రాంతి): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతపై ముందస్తు అంచనాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ ఆర్డీఓ అడ్లా రవీందర్ రెడ్డి(Banswada RDO Adla Ravinder Reddy) సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఆర్డిఓ కార్యాలయంలో శుక్రవారం డివిజన్ లోని వ్యవసాయ విద్యుత్ శాఖ ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అవసరాలకు నీటిని పొదుపుగా వినియోగిస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు.వాతావరణ పరిస్థితుల్లో మార్పులను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల సాగు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి వృథాను అరికట్టి, అవసరమైన మేరకే వినియోగించాలని తెలిపారు.
చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో అనధికారికంగా మోటార్లు ఏర్పాటు చేసి నీటిని వినియోగిస్తే, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తారని తెలిపారు.ఆరుతడి పంటలైన జొన్న, శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.
వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవడం ద్వారా నీటి కొరతతో ఎదురయ్యే ఇబ్బందులను కొంతవరకు తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.రైతులు నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని ఆర్డీఓ రవీందర్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ, బిచ్కుంద సహాయ వ్యవసాయ సంచాలకులతో పాటు విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.