గ్రాడ్యుయేట్స్ నిర్లక్ష్యం వీడండి
సత్తుపల్లి. అక్టోబర్ 23. ( విజయ క్రాంతి ): నవంబర్ 6తో ఓటరు నమోదు గడువు ముగింపు.. అర్హులందరూ నమోదు చేసుకోవాలని మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ(Motivational Speaker Brother Shafi) పిలుపునిచ్చారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే అర్హులైన పట్టభద్రులు ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుపై దృష్టి సారించాలని మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ పిలుపునిచ్చారు.
ఓటు నమోదు పట్ల అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం, ఎన్నికల ద్వారా మార్పు సాధ్యమవుతుందనే నమ్మకం లేకపోవడం వంటి కారణాలతో చాలామంది పట్టభద్రులు ఇంకా నమోదు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 6వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. తాను గతంలో మోటివేషనల్ స్పీకర్గా ప్రజలకు సేవలందించానని, ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని బ్రదర్ షఫీ తెలిపారు. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించేందుకు, వారి గొంతుకగా నిలిచేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నాణ్యత పెరగాలని, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడాల్సిన పరిస్థితి తగ్గాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందాలని ఆకాంక్షించారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థలో మెరుగైన మార్పులు తీసుకురావడం తన లక్ష్యమని పేర్కొన్నారు.
గత 34 రోజులుగా ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తూ అనేకమంది పట్టభద్రులను కలుసుకున్నానని బ్రదర్ షఫీ తెలిపారు. ఈ సందర్భంగా చాలామంది నిరాశతో మాట్లాడుతున్నారని, ఎవరికి ఓటు వేసినా మార్పు రావడం లేదనే భావన వారిలో కనిపిస్తోందని చెప్పారు. అయితే నిరాశతో ఓటు హక్కును వినియోగించుకోకుండా ఉండిపోతే ప్రజాస్వామ్యంలో మార్పు కోసం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశాన్ని కోల్పోతారని పేర్కొన్నారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు మాత్రమే కాదు.. అది పౌరుల బాధ్యత కూడా అని బ్రదర్ షఫీ అన్నారు. చదువుకున్న పట్టభద్రులు సమాజ సమస్యలపై అవగాహనతో ఆలోచించి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మార్పు కోసం ముందడుగు వేయాలంటే ముందుగా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయకుండా, గడువులోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ హక్కుపై అవగాహన పెంచుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని బ్రదర్ షఫీ విజ్ఞప్తి చేశారు.