నేర ప్రవృత్తి మార్చుకోకపోతే నగర బహిష్కరణ, పీడీ యాక్ట్ తప్పదు
నేరాలకు స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలి.. లేదంటే కఠిన చర్యలు
రౌడీషీటర్లకు గోదావరిఖని ఏసీపీ రమేష్ స్ట్రాంగ్ వార్నింగ్
గోదావరిఖని, నవంబర్ 25 (విజయక్రాంతి): రౌడీషీటర్లు తమ నేర ప్రవృత్తిని మార్చుకొని సత్ప్రవర్తనతో జీవించాలని, లేనిపక్షంలో నగర బహిష్కరణతో పాటు పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్(ACP Ramesh) హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను పిలిపించి ఏసీపీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవడం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.
రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిరంతరం పోలీసుల నిఘా ఉంటుందని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పదేపదే నేరాలకు పాల్పడుతూ ప్రవర్తన మార్చుకోని వారిపై పీడీ యాక్ట్ అమలుతో పాటు నగర బహిష్కరణకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.
నేరాలనే జీవన విధానంగా మార్చుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా సమాజంలో గౌరవంగా జీవించాలని సూచించారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతుందని ఏసీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ లింగమూర్తి, ఎస్సైలు మనోహర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.