అచ్చంపేట అభివృద్ధిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి

25-11-2026 | 06:50pm

అచ్చంపేట, నవంబర్ 25 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 26న అచ్చంపేట పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ప్రాంత అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేవైఎం నాగర్‌కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మినుగుల రాకేష్ వర్మ డిమాండ్ చేశారు. అచ్చంపేట ప్రజల తరఫున విద్య, ఉపాధి, పర్యాటకం, సాగునీటి ప్రాజెక్టులు, ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్రధాన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

అచ్చంపేటలో విద్యా కేంద్రం (Education Hub) ఏర్పాటు చేసి సమీకృత పాఠశాలలు, కళాశాలలు నిర్మించాలని కోరారు. యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు (Skill Training Centres) ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. నల్లమల అటవీ సంపద, ప్రకృతి అందాలను వినియోగించుకొని అచ్చంపేట ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా (Tourism Centre) అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు శంకుస్థాపన చేసిన చెన్నకేశవ–ఉమామహేశ్వర ప్రాజెక్టు పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో సీఎం స్పష్టంగా ప్రకటించాలని కోరారు. శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా పేరొందిన ఉమామహేశ్వర క్షేత్ర అభివృద్ధికి రూ.100 కోట్ల ప్రత్యేక నిధులు (Special Funds) కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అచ్చంపేట అభివృద్ధికి కేవలం హామీలు సరిపోవని, నిధులు, అభివృద్ధి పనులు, వాటి అమలుకు స్పష్టమైన కార్యాచరణ అవసరమని రాకేష్ వర్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన పర్యటనలో ప్రాంత అభివృద్ధిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు దేవేందర్, సంకెళ్ల అంజనేయులు, మీడియా ఇన్‌చార్జి ఉదయ్, కార్యదర్శి శివ, బీజేవైఎం రూరల్ మండల అధ్యక్షుడు రమేష్ చారి, ఉప్పునుంతల మండల అధ్యక్షుడు రాజు, భరత్, ప్రణయ్, సాయి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు