హరీష్ రావు ధర్మపురికి ఎందుకు అన్యాయం చేశారు

25-11-2026 | 06:41pm

మేడారం రిజర్వాయర్ నుంచి సాగునీరు ఎందుకు ఇవ్వలేదు

మాజీ మంత్రిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నల వర్షం

ధర్మారం, నవంబర్ 25 (విజయక్రాంతి): గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధర్మపురి నియోజకవర్గ రైతులకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) ఆరోపించారు. బుధవారం నంది మేడారం రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావును పలు ప్రశ్నలు సంధించారు. మేడారం రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకు నీటిని తరలించినప్పుడు ధర్మపురి రైతులకు ఎందుకు సాగునీరు అందించలేదని ప్రశ్నించారు.

అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరిగినప్పుడు హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని నిలదీశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మేడారం రిజర్వాయర్ నుంచి అదనపు టీఎంసీ నీటిని తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని తెలిపారు. ధర్మపురి నియోజకవర్గ సాగునీటి అవసరాలను ప్రజా ప్రభుత్వం తీరుస్తుందని, ప్రత్యేక కాలువల ద్వారా చెరువులు, ప్రాజెక్టులకు నీటిని అందించి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిపై హరీష్ రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు