అంబేద్కర్ ఆరోపణలపై స్పందించిన తెలంగాణ ఏసీబీ
హైదరాబాద్: మాజీ విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ చేసిన ఆరోపణలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) స్పందించింది. ఏసీబీలో అవినీతికి ఏమాత్రం తావులేదని, చట్టానికి ఎవరూ అతీతులు కారని స్పష్టం చేసింది. ఏసీబీ అధికారిపై వచ్చిన ఫిర్యాదుపై కూడా నిష్పక్షపాతంగా విచారణ (Impartial Investigation) జరుపుతామని వెల్లడించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు అధికారిపై మాజీ ఏడీఈ అంబేద్కర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఏసీబీ.. ఫిర్యాదుదారుడిని ఇప్పటికే మూడుసార్లు విచారణకు (Inquiry) పిలిచినట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని పేర్కొంది.
ఏసీబీ అధికారిపై వచ్చిన ఆరోపణలు విచారణలో నిరూపితమైతే సంబంధిత అధికారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సొంత శాఖకు చెందిన అధికారులైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది.
అవినీతి ఆరోపణల విషయంలో ఎవరిపైనా పక్షపాతం చూపబోమని, విచారణలో వాస్తవాలు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు (Legal Action) తీసుకుంటామని తెలంగాణ ఏసీబీ వెల్లడించింది.