ఉపాధ్యాయురాలు కృపారాణి సేవలు అభినందనీయం
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
వస్పుల జడ్పీహెచ్ఎస్లో ఘనంగా ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం
మిడ్జిల్, నవంబర్ 25: మిడ్జిల్ మండల పరిధిలోని వస్పుల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో బయో-సైన్స్ (S.A. Bio-Science) ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన జి. కృపారాణి (జడ్చర్ల మాజీ ఎంపీపీ శ్రీ నిత్యానందం సతీమణి) ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి(MLA Janampalli Anirudh Reddy honored) ముఖ్య అతిథిగా హాజరై, కృపారాణి దంపతులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల పాటు ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు సేవలందిస్తూ, విద్యాబుద్ధులు నేర్పి, క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందించడంలో కృపారాణి గారు చేసిన కృషి ఎంతో అభినందనీయమని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, అంకితభావంతో విధులు నిర్వర్తించిన ఆమె సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆమె జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.