కరెంటు సిబ్బంది లేక ఇబ్బందులు

27-10-2026 | 05:42pm

రెంజల్ మండలంలో ఖాళీగా ఏఈ, లైన్‌మెన్ పోస్టులు

బోధన్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): రెంజల్ మండలంలో విద్యుత్ శాఖలో(Electricity Department) సిబ్బంది కొరతతో వినియోగదారులు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో మొత్తం నాలుగు 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు ఉండగా, అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో విద్యుత్ నిర్వహణ పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.

ఏఈ పోస్టుతో పాటు పలువురు లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత రెండేళ్లుగా మండలంలో రెగ్యులర్ ఏఈ లేకపోవడంతో ఇన్‌చార్జి ఏఈతోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సాటాపూర్ గ్రామంలో లైన్‌మెన్ పోస్టు ఖాళీగా ఉండగా, కందకుర్తి, నీలా, సాటాపూర్, కల్యాపూర్, కూనేపల్లి, దండిగుట్ట గ్రామాలకు జూనియర్ లైన్‌మెన్లు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ విద్యుత్ లైన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు సకాలంలో మరమ్మతులు చేపట్టలేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో జాప్యం వల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందని వారు పేర్కొంటున్నారు.

మండలంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలంటే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి రెంజల్ మండలానికి పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించాలని కోరుతున్నారు.

ఈ విషయాన్ని "విజయ క్రాంతి "విద్యుత్ శాఖ ఎస్‌ఈ రాజేశ్వరరావు వద్ద ప్రస్తావించగా, పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఏఈ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. కొత్త నియామకాలు లేకపోవడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందితోనే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు