పెంటాఖుర్ధ్ సొసైటీ చైర్మన్గా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా సహకార సంఘం సేవలు అందిస్తాం
బోధన్, నవంబర్ 05 (విజయ క్రాంతి): బోధన్ మండల పరిధిలోని పెంటాఖుర్ధ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) (పీఏసీఎస్) నూతన చైర్మన్గా శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాజీ చైర్మన్ అమర్నాథ్ బాబు నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు అందుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో సొసైటీ చైర్మన్గా అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సంక్షేమం, అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సహకార సంఘం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, సహకార సంఘం సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకుంటూ, సంఘం అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని తెలిపారు.
నూతన చైర్మన్, పాలకవర్గ సభ్యుల బాధ్యతల స్వీకరణ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, చిట్టెపు కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యమ నేత శివసాయి పటేల్, గ్రామ పెద్దలు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.