నిజామాబాద్‌లో ఏటీఎం చోరీకి యత్నం

24-11-2026 | 05:24pm

అలారం మోగడంతో పరారైన దుండగుడు

బోధన్, నవంబర్ 24 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(Indian Overseas Bank) ఏటీఎంలో చోరీకి ఓ దుండగుడు యత్నించిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అర్ధరాత్రి సమయంలో ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి అక్కడి తలుపును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఏటీఎం కేంద్రంలోని అలారం మోగడంతో అప్రమత్తమైన దుండగుడు చోరీ యత్నాన్ని విరమించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బ్యాంకు సిబ్బంది వెంటనే ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి యత్నించిన వ్యక్తి భిక్షాటన చేసే వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్ వెల్లడించారు. ఏటీఎం అలారం సకాలంలో మోగడంతో నగదు చోరీ కాకుండా అడ్డుకట్ట పడిందని తెలిపారు.

మరిన్ని వార్తలు