ఉద్యోగులు ఆరోగ్య సంరక్షణ
నిర్మల్ నవంబర్ 2 ( విజయ క్రాంతి): ఉద్యోగులంతా విధి నిర్వహణతో పాటుగా తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra ) పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో, ఉద్యోగుల కోసం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra ) సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కలెక్టరేట్లోని అధికారులు, ఉద్యోగులంతా వైద్య శిబిరంలో ఉచితంగా రక్త పరీక్షలు చేసుకునేలా చూడాలన్నారు. మనకు తెలియకుండానే మనలోపల ఎన్నో అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉందని, ముందుగానే పరీక్షలు చేసుకొని అనారోగ్య సమస్యలు తెలుసుకోవడం ద్వారా ఎంతో మేలు ఉంటుందన్నారు. తగిన మందులు, జాగ్రత్తలు, జీవనశైలిలో మార్పుల ద్వారా మంచి ఆరోగ్యకర జీవితాన్ని పొందవచ్చునని చెప్పారు.
ఎవరూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని వివరించారు. ప్రతి రోజు శారీరక వ్యాయామాలు, యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్(Collectorate ) ఉద్యోగులంతా రక్త పరీక్షలు పూర్తి చేసుకునే వరకు వైద్య శిబిరం కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, అధికారులు సౌమ్య, సిబ్బంది, తదితరులు ఉన్నారు.