కేజీబీవీ అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
డీఈఓపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త కుసుమ రామకృష్ణ
భూపాలపల్లి టౌన్, నవంబర్ 02 (విజయ క్రాంతి): జిల్లాలోని ఏడు కేజీబీవీల్లో మిగులు బడ్జెట్ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని, బాధ్యులైన స్పెషల్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకుండా వారికి అండగా నిలుస్తున్న జిల్లా విద్యాశాఖ అధికారిపై(District Educational Officer) చర్యలు తీసుకోవాలని ఆర్టీఐ కార్యకర్త కుసుమ రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి, టేకుమట్ల, రేగొండ, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, మహదేవపూర్ కేజీబీవీల్లో నాసిరకం వస్తువులను అధిక ధరలకు కొనుగోలు చేసి, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ విషయంపై సెప్టెంబర్ 10న ఆధారాలతో డీఈఓకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.