దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
దామరచర్ల :నవంబర్ :2: దామరచర్ల మండలంలోని బెట్టే తండా, రాళ్లవాగు తండా గ్రామాల్లో అకాల వర్షాల కారణంగా నేలకు వరిగిన వరి పంటను సోమవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshma Reddy) పరిశీలించారు. రైతులతో కలిసి దెబ్బతిన్న వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నష్టానికి సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
అనంతరం సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి, గాలివానల కారణంగా జరిగిన పంట నష్టాన్ని వెంటనే క్షేత్రస్థాయిలో అంచనా వేసి, నష్ట వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగు నాయక్, సర్పంచ్ లు సైదా, శంకర్ నాయక్ ,సిద్దు నాయక్ ,రేణుక ,శ్రీనివాస్ ,సర్పంచ్ ల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు బెజ్జం సాయి,రవితేజ తదితరులు పాల్గొన్నారు..