అదుపు తప్పితే ప్రమాదమే!
- విద్యార్థుల భద్రతకు బావి ముప్పు
రాకాసిపేట జేసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో తెరిచి ఉన్న బావి
భద్రతా చర్యలు లేకపోవడంతో పొంచి ఉన్న ప్రమాదం
840 మంది విద్యార్థుల రక్షణపై తల్లిదండ్రులు, ప్రజల్లో ఆందోళన
బోధన్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని రాకాసిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేసీ)(Government High School) ప్రాంగణంలో విద్యార్థుల భద్రతకు ప్రమాదకరంగా మారిన తెరిచి ఉన్న బావిని వెంటనే రక్షణ చర్యలతో కప్పివేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న ఈ బావికి సరైన రక్షణ కంచె, పైకప్పు లేదా ఇతర భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ పాఠశాలలో సుమారు 840 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతిరోజూ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలోనే తిరుగుతుండగా, ముఖ్యంగా భోజన విరామ సమయంలో, ఇతర ఖాళీ సమయాల్లో కొందరు విద్యార్థులు బావి గోడపై కూర్చొని సరదాగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏమాత్రం అదుపు తప్పినా బావిలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ ప్రమాద ఘటనలు
ఇప్పటికే ఈ ప్రాంతంలో విద్యార్థులు ప్రమాదాలకు గురైన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, పాఠశాల ఆవరణలోని బావి విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థికి గతంలో చేతికి గాయం కావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేస్తున్నారు.
పాఠశాల ప్రాంగణంలో ఇలాంటి ప్రమాదకరమైన ప్రదేశాలకు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ప్రజలు అంటున్నారు. విద్యార్థులు తెలియకో, ఆటపాటల్లో భాగంగానో బావి వద్దకు వెళ్లే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి అని పేర్కొంటున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడమెందుకు?
ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ప్రమాదం జరగకముందే నివారణ చర్యలు చేపట్టడం ఎంతో ముఖ్యమని తల్లిదండ్రులు చెబుతున్నారు. వంద లాది మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాల ఆవరణలో బావి తెరిచి ఉండటం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే పైకప్పు లేదా రక్షణ కంచె ఏర్పాటు చేయాలి
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బావిపై పటిష్టమైన పైకప్పు ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ రక్షణ కంచె, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత విద్యాశాఖ, మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి బావిని పరిశీలించి శాశ్వత భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగే పరిస్థితి ఏర్పడే వరకు వేచి చూడకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని తల్లిదండ్రులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: