బ్లాస్టింగుల మోత.. ధ్వంసమైన రోడ్లు!

10-09-2026 | 04:10am
  1. మాదారంలో క్వారీ కష్టాలు
  2. నరకప్రాయంగా మారిన రహదారులు
  3. పట్టించుకోని మైనింగ్ శాఖ
  4. లారీలను నియంత్రించని రవాణా శాఖ

జిన్నారం, సెప్టెంబర్ 9: సంగారెడ్డి జిల్లా(Sangareddy District) జిన్నారం మండల పరిధిలోని మాదారం గ్రామంలో కంకర క్వారీల నిర్వహణ స్థానిక ప్రజల పాలిట శాపంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న భారీ బ్లాస్టింగులు, పరిమితికి మించి లోడుతో నడుస్తున్న లారీల కారణంగా ఇక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. మాదారం క్వారీల్లో జరుపుతున్న భారీ పేలుళ్ల (బ్లాస్టింగుల) ధాటికి చుట్టుపక్కల నివాసాలు కంపించిపోతున్నాయి.

తీవ్రమైన శబ్ద కాలుష్యంతో పాటు, భూమి ప్రకంపనలకు గురవుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ బ్లాస్టింగుల ప్రభావంతో గ్రామంలోని పలు ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఈ భారీ శబ్దాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేలుళ్ల సమయంలో వెలువడే దుమ్ము, ధూళి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అధిక లోడు లారీలు.. అస్తవ్యస్థమైన రోడ్లు..

క్వారీల నుంచి కంకర, మెటల్ తరలించే లారీలు మోతాదుకు మించి (ఓవర్ లోడ్) ప్రయాణిస్తుండటంతో గ్రామీణ రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఒకప్పుడు బాగున్న రోడ్లు ఇప్పుడు పెద్ద పెద్ద గుంతలుగా మారి దర్శనమిస్తున్నాయి. రహదారులపై కనీసం నడవలేని పరిస్థితి నెలకొంది. బైక్లపై వెళ్లే వాహనదారులు ఈ గుంతల వల్ల ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడుతున్నారు.

వర్షం పడితే ఈ గుంతల్లో నీరు చేరి రోడ్డు ఎక్కడుందో, గుంత ఎక్కడుందో తెలియక ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోంది. భారీ లారీలు అతివేగంగా, అడ్డగోలుగా నడపడం వల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కాలినడకన వెళ్లే గ్రామస్థులు నిత్యం ప్రమాద భయంతో చేతిలో ప్రాణాలు పెట్టుకుని తిరగాల్సి వస్తోంది. రోడ్ల దుస్థితిపై, లారీల ఓవర్ లోడి్ంప అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు మండిపడుతున్నారు. 

పట్టించుకోని అధికారులు

నిబంధనల ప్రకారం క్వారీ నిర్వాహకులు రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉన్నా, వాటిని పూర్తిగా గాలికొదిలేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం, రోడ్ల నిర్వహణను పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను పణంగా పెడుతున్న క్వారీ బ్లాస్టింగులపై మైనింగ్, పర్యావరణ శాఖ అధికారులు తక్షణమే స్పందించి విచారణ జరపాలని మాదారం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ లోడ్ లారీలను నియంత్రించి, ధ్వంసమైన రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఘట్ కేసర్ బస్సు టర్మినల్ వద్ద ఆటోల ఆగడాలు

అదుపు తప్పితే ప్రమాదమే!

మరిన్ని వార్తలు