6 September, 2026 | 11:28 AM

సత్తుపల్లిలో బీఆర్ఎస్ 'రణభేరి'

06-09-2026 | 09:44am

విద్యార్థులు, నిరుద్యోగులతో సండ్ర వెంకట వీరయ్య భారీ ర్యాలీ

సత్తుపల్లి, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): సత్తుపల్లి. ఎన్నికల సమయంలో యువత, విద్యార్థుల భవిష్యత్తును మార్చుతామని యూత్ డిక్లరేషన్(Youth Declaration) పేరుతో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. 1000 రోజులు పూర్తయినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ చేపట్టిన “1000 రోజుల కాంగ్రెస్ పాలన(Congress rule) వైఫల్యాలపై పోరుబాట” లో భాగంగా సత్తుపల్లిలో విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్(R&B Guesthouse) నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ర్యాలీ అనంతరం జరిగిన సభలో సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ.. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, విద్యా భరోసా కార్డులు వంటి హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, గురుకుల విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సండ్ర ఆరోపించారు. జిల్లాకో యూపీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, పోటీ పరీక్షల దరఖాస్తు రుసుముల మినహాయింపు వంటి హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, యూత్ డిక్లరేషన్‌లోని ప్రతి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని సండ్ర వెంకట వీరయ్య(Sandra Venkata Veeraiah) డిమాండ్ చేశారు. “విద్యార్థులు, నిరుద్యోగులు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి రావడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా వెంటనే హామీలను అమలు చేయాలి. లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో నిరుద్యోగులు, విద్యార్థుల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని సండ్ర హెచ్చరించారు. బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త 1000 రోజుల నిరసన కార్యక్రమాల్లో యువత, విద్యార్థుల సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది.

మరిన్ని వార్తలు