దానం కేసులో సుప్రీం తీర్పు

24-09-2026 | 12:25pm

న్యూఢిల్లీ: విజయక్రాంతి: ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender ) అనర్హత వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. తనపై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును(Danam Nagender Supreme Court Verdict) ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించినట్లు సమాచారం. దానం నాగేందర్ పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం(Secunderabad Lok Sabha seat) నుంచి పోటీ చేశారు. ఈ వ్యవహారాన్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనల పరిధిలో పరిశీలించిన తెలంగాణ హైకోర్టు(Telangana High Court) సెప్టెంబర్ 18న ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. ఈ అనర్హత 2024 ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని కూడా ఖాళీగా ప్రకటించింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోరగా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు అంగీకరించింది. దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు పలు రాజ్యాంగపరమైన అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని, పార్టీ తనపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. మరోవైపు, హైకోర్టు మాత్రం ప్రత్యర్థి పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్న చర్యగా పరిగణించింది. తాజా పరిణామంతో ఖైరతాబాద్ అసెంబ్లీ(Khairatabad Assembly) స్థానానికి తదుపరి చర్యలు, ఉప ఎన్నికకు సంబంధించిన ప్రక్రియపై కూడా ఆసక్తి నెలకొంది. హైకోర్టు ఇప్పటికే ఈ స్థానాన్ని ఖాళీగా ప్రకటించి, ఆదేశాల ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించింది.

మరిన్ని వార్తలు