4 September, 2026 | 9:42 PM

గిరిజనేతరుల అక్రమ పట్టాలపై గోండ్వానా సంక్షేమ పరిషత్ గర్జన

04-09-2026 | 08:25pm

వెంకటాపురం,(విజయక్రాంతి): ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కి వెంకటాపురం మండలంలో వందల ఎకరాల అక్రమ పట్టాలు సృష్టిస్తున్నారని, వాటిని వెంటనే రద్దు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా(Mulugu District) అధ్యక్షుడు పూనేం ప్రతాప్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన గోండ్వానా సంక్షేమ పరిషత్((Gondwana Welfare Council)) సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు భూ బదలాయింపులు జరగకూడదనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఎల్.టి.ఆర్, 1/70, పీసా వంటి పటిష్టమైన చట్టాలను నేడు రెవెన్యూ అధికారులే ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.

వెంకటాపురం మండలం(Venkatapuram Mandal) మరికల (జెడ్) గ్రామంలో సర్వే నంబర్లు 123,122, 120 లలో గల వందల ఎకరాల భూములను తప్పుడు పత్రాలతో వలస గిరిజనేతరుల పేర్లపై అక్రమంగా పట్టాలు చేశారని, డిజిటల్ రికార్డులను తారుమారు చేస్తూ భూభారతి పోర్టల్(Bhubharati Portal)లో నిబంధనలకు విరుద్ధంగా వారి పేర్లను నమోదు చేస్తున్నారని, ఇది రెవెన్యూ అధికారుల ప్రమేయం లేకుండా జరగదని, ఈ విషయమై మండల రెవెన్యూ అధికారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇది సిగ్గుచేటని మండిపడ్డారు. అధికారులు స్పందించకపోతే త్వరలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి పట్టా మార్పిడిని సవాల్ చేస్తామని,అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తాటి రాజేష్,తాటి లక్ష్మయ్య, భీమయ్య,సిద్దు,చంటి, కొమరయ్య,రమేష్,చందు తదితరులు పాల్గొన్నారు.