లక్ష గాజుల అలంకరణలో జోగులాంబ అమ్మవారు
శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులకు దివ్య దర్శనం
అలంపూర్, సెప్టెంబర్4(విజయక్రాంతి): శ్రావణ శుక్రవారం(Shravana Friday) సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శ్రీ జోగులాంబ అమ్మవారు లక్ష గాజుల(lakh banglesd) అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రంగురంగుల గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారి దివ్యమంగళ రూపం భక్తులను భక్తి పరవశంలో ముంచెత్తింది.
శ్రావణ శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. లక్ష గాజుల కాంతులతో కొలువుదీరిన జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అమ్మవారి కరుణాకటాక్షాలు తమ కుటుంబాలపై ఉండాలని ప్రార్థించారు.అమ్మవారి దివ్య అలంకరణతో ఆలయ ప్రాంగణం భక్తి శోభతో కళకళలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో దీప్తి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి






