తెలంగాణకు జలధార
నారాయణపూర్ నుంచి తెలంగాణకు నీళ్లు.. రైతులకు ఊరట
నీళ్లొచ్చాయ్.. రైతుల్లో కొత్త ఆశ!
హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు భారీ ఊరట లభించింది. నారాయణపూర్ జలాశయం(Narayanpur Reservoir) నుంచి తెలంగాణ వైపు కృష్ణా జలాలను విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో(Karnataka CM DK Shivakumar) తెలంగాణ కాంగ్రెస్ నేతలు జరిపిన చర్చలు ఫలప్రదంగా మారడంతో నీటి విడుదలకు మార్గం సుగమమైంది. నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేసే విషయంలో తక్షణ చర్యలు చేపట్టాలని డీకే శివకుమార్ అధికారులను ఆదేశించారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు వచ్చే నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఏర్పడింది.
ఇప్పటికే జూరాల ప్రాజెక్టు(Jurala Project) వద్ద అధికారులు నీటి విడుదల ప్రక్రియను చేపట్టారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి నీటిని ఎత్తిపోస్తున్నారు. జూరాలకు సుమారు 2,509 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జూరాల ఎడమ కాల్వకు 1,000 క్యూసెక్కులు, కుడి కాల్వకు 536 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటితో ఆయకట్టు పరిధిలోని పంటలకు సాగునీటి ఇబ్బందులు కొంతమేర తగ్గే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు(Congress leaders) తెలిపారు. నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) రైతులకు కర్ణాటక నుంచి జలాల విడుదలపై సానుకూల స్పందన ఉపశమనాన్ని కలిగిస్తోంది. జూరాల, నెట్టెంపాడు పరిధిలో నీటి లభ్యతను బట్టి అధికారులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.