కోపముంటే కేసీఆర్‌పై చూపించాలి!

23-09-2026 | 05:35am
  1. రైతులు ఏం తప్పు చేశారు n‘జూరాల’లో నీళ్లున్నా ఎందుకు ఇవ్వట్లేదు 
  2. హక్కులేని రాయలసీమకు 300 టీఎంసీలా? 
  3.    8, 9 గంటలు కూడా కరెంట్ సరిగా ఇవ్వడంలేదు 
  4. కాంగ్రెస్ పని ఎంతసేపూ దోచుకోవడం, దాచుకోవడమేనా? 
  5. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపం ఉంటే కేసీఆర్‌(KCR)పై చూపించాలి.. అంతేకాని రైతుల(Farmers)పై చూపొద్దని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) పేర్కొన్నారు. జూరాల ప్రాజెక్టు(Jurala Project)లో నీళ్లు ఉన్నా ఎందుకు ఇవ్వట్లేదని మండిపడ్డారు. హక్కులేని రాయలసీమకు కృష్ణానది(Krishna River) నుంచి 300 టీఎంసీలు ఎలా తరలిపోతున్నాయని ప్రశ్నించారు. తెలంగాణలో సెప్టెంబర్‌లోనే పంటలు ఎండిపోతున్నాయన్నారు. ప్రాణహితలో మాత్రమే నీళ్లున్నాయని, మేడిగడ్డను పంట్టించుకోకుంటే పరిస్థితి ఘోరంగా ఉంటుందని హెచ్చరించారు.

కాంగ్రెస్‌కు ఎంతసేపు దాచుకోవడం, దోచుకోవడం తప్పితే ప్రజలకు, రైతులకు చేసిందేమీలేదన్నారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్యభవన్‌లో రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, వెంకటేష్, సత్తిరెడ్డి, విఠల్‌రావు, ఇంద్రసేనా రెడ్డి, సాంబయ్య, కర్వందర్ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. రైతులు గొడవ చేస్తే తప్ప నీళ్లు వదలాలనే సోయి లేదా? అని విమర్శించారు.

ఎల్ నినోపై ముందస్తు సోయి లేకుండా కేంద్రం ప్యాకేజీ ఇవ్వాలనడం కాంగ్రెస్ పాలనా వైఫల్యమన్నారు. మేడిగడ్డ వద్ద 36 వేల క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతున్నదని, లిఫ్ట్ చేసుకునేందుకు ఎన్డీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. కృష్ణా నది నుండి హక్కులేని రాయలసీమ 300 టీఎంసీల నీళ్లు తీసుకెళ్తుంటే కళ్ళముందే నీళ్లున్నా రైతుల గోస పుచ్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉత్తర తెలంగాణను ఎండబెట్టొద్దు..

రైతులు, ఇంజనీర్లకు ఏం ద్వేషం ఉంటుందని, నీళ్లు కావాలని అడిగితే ఎదురుదాడి చేస్తున్నారని ఈటల ప్రశ్నించారు. రిటైర్డ్ ఇంజనీర్లు చేస్తున్న సలహాలు, సూచనలు పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉత్తర తెలంగాణను ఎండబెట్టొద్దని, హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు తీసుకురావొద్దన్నారు. ఎల్ నినో కారణంగా రైతులకు మళ్ళీ పాత కరెంటు కోతలు, కాలిన మోటార్ల రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఉంటుందన్నారు. రాష్ట్రంలో అడ్డగోలుగా కరెంట్ కోతలు జరుగుతున్నాయన్నారు. 24 గంటలు దేవుడెరుగు.. 8, 9 గంటల కూడా కరెంట్ సరిగా రావడం లేదన్నారు. ఇంత ఘోరమైన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు. ఈ వర్షాకాలం పంటలకు నీరు అందించాలని, లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు