6 September, 2026 | 10:19 AM

నేపాల్‌లో మృతులు 1,344

06-09-2026 | 05:20am
  1. ఇంకా 5,000 మంది గల్లంతు
  2. 60 ఏళ్ల వృద్ధురాలిని రక్షించిన ఏపీఎఫ్
  3. కొనసాగుతున్న సహాయక చర్యలు

కాఠ్మాండూ, సెప్టెంబర్ 5: నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల( Massive flash floods ) కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 1,344కు పెరిగింది. ప్రభావిత ప్రాంతాల నుంచి మరిన్ని మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ పోలీసులు (Nepal Police) తెలిపారు. కనీసం 589 మంది విదేశీయులతో సహా సుమారు 5,000 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు.

అదే సమయంలో, 13,100 మందికి పైగా ప్రజలను సురక్షితంగా రక్షించామని తెలిపారు. బురద, శిథిలాల కింద చిక్కుకుపోయిన ప్రాణంతో ఉన్న 60 ఏళ్ల వృద్ధురాలిని కాపాడారు. నేపాల్‌లోని నువాకోట్ జిల్లా బిదుర్ పట్టణంలో, వరదల సమయంలో బురద, శిథిలాల కింద చిక్కుకుపోయి నాలుగు అంతస్తుల భవనం పై అంతస్తులో 10 రోజుల పాటు ఉండిపోయిన ఆమెను సజీవంగా బయటకు తీశారు. విపత్తు తర్వాత ఆమె ఆచూకీ లభించకపోవడంతో, ఆమె చనిపోయిందని భావించిన కుటుంబ సభ్యులు అప్పటికే ఆమెకు ప్రతీకాత్మక అంత్యక్రియలు నిర్వహించారు.

చండికా శ్రేష్ఠ అనే ఆ మహిళ అపస్మారక స్థితిలో ఉండగా ఆరమ్డ్ పోలీస్ ఫోర్స్ (ఏపీఎఫ్) బృందం గుర్తించింది. చికిత్స కోసం ఆమెను త్రిశూలిలోని నేపాలీ ఆర్మీకి చెందిన మైథిలి బ్యారక్స్‌కు తరలించారు. ఆగస్టు 26న నేపాల్- ఆకస్మిక వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. చైనా మీడియా నివేదికల ప్రకారం.. ఈ విపత్తు కారణంగా చైనా వైపు కూడా 21 మంది మరణించారు. టిబెట్‌లో 500 మందికి పైగా గల్లంతయ్యారు.

నేపాల్‌లో ఇప్పటివరకు వెలికితీసిన మొత్తం మృతదేహాలలో 758 మంది పెద్దలు, 85 మంది పిల్లలవి ఉన్నాయి. అన్ని జిల్లాలలోకెళ్లా అత్యధికంగా ఒక్క చిత్వాన్‌లోనే 360 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలినవి నవల్పరాసి తూర్పు, నవల్పరాసి పశ్చిమ, నువాకోట్, రసువా, గోర్ఖా, ధాడింగ్, తనాహున్ జిల్లాలకు చెందినవని నేపాల్ జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు మరియు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) తెలిపింది.

ఇప్పటివరకు 98 మృతదేహాలను మాత్రమే కుటుంబాలకు అప్పగించినట్లు పేర్కొంది. డీఎన్‌ఏ సేకరణతో సహా అవసరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత, సుమారు 1,030 మృతదేహాలను తాత్కాలికంగా ఖననం చేసినట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. వరద ప్రభావిత జిల్లాల్లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద భారీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ వందలాది మంది సొరంగాల్లో చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు.

ఈ ఆపరేషన్లలో భారత్, చైనా నిపుణుల బృందాలు నేపాల్ నిపుణులకు సహకరిస్తున్నాయి. శుక్రవారం నుంచి సొరంగాల నుంచి ముగ్గురిని రక్షించారు. కొండచరియలు విరిగిపడే ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కార్మికులు శనివారం చికిత్స పొందుతూ మరణించారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో దార్చులా జిల్లాలోని భట్టార్ ప్రాంతంలో తాజాగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చౌలానీ నది ప్రవాహానికి అండ్డంకిగా మారింది. నదిలో అడ్డంగా పడిన రాల్లు తొలిగిపోతే వరద ప్రమాదం పొంచి ఉంది. 

మరిన్ని వార్తలు