మిల్లర్లు, వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి

08-10-2026 | 08:10pm

కునూరు సంజయ్ దాస్ గౌడ్

చిట్యాల,(విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావాన్ని సాకుగా చూపుతూ బియ్యానికి కృత్రిమ కొరత సృష్టిస్తున్న రైస్ మిల్లర్లు(Rice Millers), వ్యాపారులు, దళారులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కునూరు సంజయ్ దాస్ గౌడ్(Kunoori Sanjay Das Goud) గురువారం డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా బియ్యం ధరలు గణనీయంగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. కొందరు మిల్లర్లు, దళారులు బియ్యం కొరత ఉన్నట్లు కృత్రిమంగా ప్రచారం చేస్తూ ధరలను పెంచి ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బియ్యాన్ని నిల్వ చేస్తున్న వ్యాపారులను విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించి కేసులు నమోదు చేయాలని కోరారు. అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, సంబంధిత గోదాములను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై ప్రభుత్వం వెంటనే తనిఖీలు, దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని బియ్యం ధరలను నియంత్రించి, పేద, మధ్యతరగతి ప్రజలకు న్యాయమైన ధరకు బియ్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సంజయ్ దాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు