కల్లాల వద్దే వ్యాపారులు, మిల్లర్ల ధాన్యం కొనుగోళ్లు
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 24, (విజయక్రాంతి): ఈ ఏడాది వరి రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో, ములుగు జిల్లా(Mulugu district) వెంకటాపురంలో అరకొర వరి పంట చేతికందడంతో వ్యాపారులు ఎగబడి కొనుగోళ్లు చేస్తున్నారు. రైతుల కల్లాల వద్దనే ధాన్యం కాంటాలు పెట్టి ఒకరికి మించి ఒకరు అధిక ధర పెడుతూ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. చెల్లింపులు సైతం వెంటనే చేస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రైతు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయిస్తే నెల రోజుల దాటినా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయని పరిస్థితి ఉండేది. ధాన్యం డబ్బుల కోసం రైతులు పీఏసీఎస్, బ్యాంకుల చుట్టూ తిరిగేవారు.ప్రస్తుతం ఆ పరిస్థితి రైతులకు లేదు. రైతులు పంట కోసిన వెంటనే పచ్చి ధాన్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తూ మిల్లులకు తరలిస్తున్నారు. ముఖ్యంగా సన్నాలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎగబడుతున్నారు. ఈ ఏడాది ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. రైతుల పంటపొలాల్లోనే పచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో అధిక బరువు అధికంగా ఆదాయాన్ని పొందుతున్నారు.
గతంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో, క్వింటాలు నాలుగైదు కిలోలు కోత పెట్టేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆనందంగా ధాన్యం విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సన్నాలకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నప్పటికీ రైతులు ప్రైవేట్ వ్యాపారులకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయాలు లేకపోవడంతో తమకు ప్రతి ఏటా వచ్చే ఆదాయం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యానికి బయట మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటంతో మిల్లర్లు సన్నాలను ఎక్కవ మొత్తంలో కొనుగోలు చేసి బియ్యాన్ని బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరం రైతులకు వరి పంటలో అధిక లాభాలు వచ్చాయి.