సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు
మంగపేట, నవంబర్ 24 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి(Lord Sri Sitaramachandra) వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి(Karthika Pournami) పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీ కుమారాచార్యులు అధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కథా పారాయణం, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
లోక కల్యాణార్థం, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలనే ఉద్దేశంతో ఈ సామూహిక వ్రతాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. వ్రతాలు పూర్తయిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కోరుకోప్పుల శంకర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు.