రైల్వే వంతెన, విద్యుత్‌, తాగునీటి సమస్యలను పరిష్కరించాలి

27-10-2026 | 05:39pm

ఘట్ కేసర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) :  ఘట్ కేసర్ డివిజన్(Ghatkesar Division) పరిధిలోని మేడపాటి నగర్, బృందావన్ కాలనీ, ద్వారకా నగర్, ఈడబ్ల్యూఎస్ కాలనీలలో నెలకొన్న  విద్యుత్‌, తాగునీటి సమస్యలతో పాటు రైల్వే బ్రిడ్జి పనుల పరిష్కారం కోసం స్థానిక మహిళలు ఐకమత్యంతో ముందుకు వచ్చారు. వారి విజ్ఞప్తి మేరకు జన చైతన్య సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ మంగళవారం  ఆసమస్యలను డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

రైల్వే వంతెన నిర్మాణంలో జాప్యం, కాలనీలలో తాగునీటి కొరత, మేడపాటి నగర్‌లో విద్యుత్ సమస్యలను వివరించగా, వజ్రేష్ యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ వచ్చే ఏడాది మార్చి లోపల రైల్వే వంతెన నిర్మాణం పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు.

మేడపాటి నగర్ కాలనీకి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ మంజూరైనప్పటికీ ఏర్పాటు ఆలస్యం కావడంతో విద్యుత్ సమస్య కొనసాగుతోంది. దీనిపై విద్యుత్ శాఖ ఏఈ స్పందించి, ట్రాన్స్‌ఫార్మర్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన మహిళలకు, అబ్బసాని యాదగిరియాదవ్‌ కి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే వంతెన నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు అధికారులను కోరారు.

మరిన్ని వార్తలు