గ్రామీణ పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుల చేయూత

27-10-2026 | 06:25pm
  1. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా రావిపహాడ్‌ ప్రభుత్వ బడి
  2. 115 మంది విద్యార్థులకు రూ.10 వేల విలువైన ఐడీ కార్డుల పంపిణీ
  3. గ్రామ మాజీ సర్పంచ్‌ కోటేష్‌ ఔదార్యం.. ఉపాధ్యాయుల కృషికి ప్రశంసలు

మోతె, అక్టోబర్ 27 (విజయ క్రాంతి): తమ స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాల(Government School) అభివృద్ధికి గ్రామస్తులు ముందుకు రావడం శుభ పరిణామమని ఎఫ్‌ఎల్‌ఎన్‌ జిల్లా ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌ సభ్యులు దయాకర్‌, శ్రీనివాస్‌ అన్నారు. మోతె మండల పరిధిలోని రావిపహాడ్‌ ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు.

విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఎఫ్‌ఎల్‌ఎన్‌ తరగతులు, ఉపాధ్యాయుల బోధనా విధానాలను పరిశీలించి పలు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్‌ శామలేటి కోటేష్‌ 115 మంది విద్యార్థులకు రూ.10 వేల విలువైన ఐడీ కార్డులను అందజేశారు.ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం గొప్ప విషయమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాయకపు పరమేష్‌, ఉపాధ్యాయులు పాపిరెడ్డి, నరసింహారెడ్డి, నాగరాజు, రాజేశ్వరి, రమ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు