22 కిలోల గంజాయిని పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు
ఇద్దరు నిందితులు అరెస్ట్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఒడిశా నుంచి గోవాకు భారీగా గంజాయి తరలిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఉప్పల్ జోన్ ఎస్ఓటి పోలీసులు(Uppal Zone SOT Police) రట్టు చేశారు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టిన క్రమంలో ఈ ముఠా పోలీసులకు చిక్కింది. వారి వద్ద నుంచి రూ. 24 లక్షల విలువైన గంజాయి, కారు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం పోచారం ఐటీ కారిడార్(Pocharam IT Corridor) పరిధిలోని యంనంపేట పద్మనాభస్వామి ఆలయ సమీపంలో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక మారుతి బలెనో కారును ఆపి సోదాలు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో కారులో అక్రమంగా తరలిస్తున్న 22 కిలోల గంజాయి బయటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారులో ఉన్న ఒడిశాకు చెందిన అనిల్‌కుమార్ గౌడ, అవినాష్ శర్మలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 22 కిలోల గంజాయితో పాటు, రవాణాకు ఉపయోగించిన GA07 H 3746 నంబర్ గల బలెనో కారు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ. 24 లక్షల వరకు ఉంటుందని ఎస్‌వోటీ అధికారులు వెల్లడించారు.
ఈ ముఠా ఒడిశా నుంచి గోవాకు గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు తెలిపారు.