డంపింగ్ యార్డును తరలించి, ప్రజలకు కాలుష్య సమస్య నుంచి విముక్తి కల్పించాలి
- మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్
- అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్ మీదుగా కీసర వరకు ఈటల రాజేందర్ రెండో రోజు జన సంకల్ప యాత్ర
ఘట్ కేసర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : జవహర్నగర్ డంపింగ్ యార్డును(Jawaharnagar Dumping Yard) తక్షణమే తరలించి, పరిసర ప్రాంతాల ప్రజలకు కాలుష్య సమస్య నుంచి విముక్తి కల్పించాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Eatala Rajender) చేపట్టిన జన సంకల్ప యాత్ర రెండో రోజు బుధవారం అన్నోజిగూడ నుంచి ప్రారంభమైంది.
ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలో పాదయాత్ర నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డు సమస్యపై ప్రభుత్వం స్పందించి, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డు కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్ కోర్టు తీర్పులను అక్కదోవ పట్టించడం వల్ల ఈ సమస్య తీరడంలేదన్నారు.
కోర్టులు తీర్పులు ఇచ్చాయని, మేధావులు పరిష్కారం మార్గాలు చెబుతున్నారని, అత్యధిక టెక్నాలజీ ఉపయోగించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలన్నారు. ప్రజలకు ఇచ్చే హామీలకే పరిమితం కాకుండా సమస్య పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ప్రజల సమస్యను ప్రజాక్షేత్రంలో ప్రస్తావిస్తూ, సమస్య పరిష్కారానికి ఒత్తిడి తీసుకురావడమే ఈ జన సంకల్ప యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి
ఈటల రాజేందర్ పాదయాత్రకు మద్దతుగా వచ్చి పాల్గొన్న మార్గదర్శకులు ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ మనం పీల్చే గాలి స్వచ్చంగా ఉండాలి అది మన హక్కు. ఇక్కడ గాలి విషం అయ్యింది. జవహర్ నగర్ డంప్ యార్డు కు వ్యతిరేకంగా ఇరవై ఐదేళ్ల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశాం.
జస్టిస్ స్వతంత్ర కుమార్ జవహర్ నగర్ డంప్ యార్డు ఎత్తివేయాలని ఆర్డర్ ఇచ్చారు. దానిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. నాలుగు రోజుల పాటు సుమారు 60 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ జన సంకల్ప యాత్రలో భాగంగా రెండో రోజు అన్నోజిగూడ నుంచి ఘట్కేసర్, యంనంపేట్, ఇస్మాయిల్ ఖాన్ గూడ, రాంపల్లి, కరీంగూడ, రాంపల్లి దాయారా మీదుగా కీసర వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి కీసరలోని మేఘనా కన్వెన్షన్లో బస చేయనున్నారు.
ఈ యాత్రలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకురాలు బోడిగ శోభ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బిజెపి జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.