విద్యార్థులతో పోలీసుల ముఖాముఖి

28-10-2026 | 09:41pm

పోలీస్ స్టేషన్ పనితీరు, సమాజంలో పోలీసుల పాత్రపై అవగాహన

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని, పేట్ బషీరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక రెయిన్‌బో హైస్కూల్ విద్యార్థులతో బుధవారం ఒక ప్రత్యేక ఇంటరాక్షన్ సెషన్‌ను నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర, పోలీస్ స్టేషన్ అంతర్గత పనితీరుపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ సమాజంలో శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడంలో, ప్రజల ఆస్తిపాస్తులను, ప్రాణాలను రక్షించడంలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమైనదని వివరించారు. దేశ రక్షణ కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ఈ వారోత్సవాల ద్వారా స్మరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒక పోలీస్ స్టేషన్ దైనందిన జీవితంలో ఎలా పనిచేస్తుంది, బాధితుల నుంచి ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తారు.

కేసుల దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందనే విషయాలను విద్యార్థులకు సరళమైన భాషలో వివరించారు. నేరాల నియంత్రణ, రాత్రి వేళల్లో గస్తీ, మహిళలు, బాలల భద్రత కోసం పోలీస్ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేశారు. ఏదైనా ఆపద సమయం వస్తే వెంటనే 'డయల్ 100' లేదా అందుబాటులో ఉన్న అత్యవసర నంబర్లను ఎలా సంప్రదించాలో ప్రాక్టికల్‌గా వివరించారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు వహించాల్సిన జాగ్రత్తలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పేట్ బషీరాబాద్ పోలీస్ సిబ్బంది, రెయిన్‌బో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు