రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఇద్దరు విద్యార్థుల ఎంపిక
*మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థుల ప్రతిభ
మేడిపల్లి, నవంబర్ 03 (విజయక్రాంతి): పీఎం శ్రీ మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School)కు చెందిన విద్యార్థులు క్రీడా రంగంలో ప్రతిభ చాటి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్రస్థాయి పీఎం శ్రీ కబడ్డీ పోటీలలో పాఠశాలకు చెందిన జె. మహేందర్, బి. గణేష్ ఎంపికై తమ సత్తా చాటారు.
అదేవిధంగా జిల్లా స్థాయి పీఎం శ్రీ క్రీడా పోటీల్లోనూ పాఠశాల విద్యార్థులు హర్షద్ లాంగ్ జంప్ లో ద్వితీయ స్థానం సాధించి రజత పతకం కైవసం చేసుకోగా, వెన్నెల 100 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం, మేఘన 400 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం సాధించి కాంస్య పతకాన్ని సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. విద్యార్థుల ఈ విజయాల పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
పాఠశాలలో పిఈటి లేకపోయినప్పటికీ ఆంగ్ల ఉపాధ్యాయిని విజయలక్ష్మి పర్యవేక్షణతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమిష్టి కృషి ఈ విజయాలకు దోహదపడిందని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తీసుకొచ్చిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.