నల్లగొండ ఆలయ వాహన పార్కింగ్ వేలం
- ఆదాయం రూ.12.16 లక్షలు
- గత ఏడాది కంటే రూ.2.64 లక్షల పెరుగుదల
కొడిమ్యాల, నవంబర్ 3 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో(Lakshmi Narasimha Swamy Temple, Nalgonda) మంగళవారం వాహన పార్కింగ్ కాంట్రాక్టుకు(Vehicle Parking Contract) సంబంధించి నిర్వహించిన టెండర్ బహిరంగ వేలం విజయవంతంగా ముగిసింది.
07.02.2027 నుండి 06.02.2029 వరకు రెండు సంవత్సరాల కాలానికి గాను ఈ వేలం నిర్వహించగా,రూ. 12,16,000/-ల ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి డి.కిరణ్ తెలిపారు.గత ఏడాది పార్కింగ్ ద్వారా రూ. 9,52,000/- ఆదాయం రాగా,ఈసారి వేలంలో రూ. 2,64,000/- అదనంగా పెరిగిందని ఆయన వెల్లడించారు.
ఈ బహిరంగ వేలంలో స్తంభంపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ పరశురాములు అత్యధిక మొత్తానికి పాట పాడి పార్కింగ్ హక్కులను దక్కించుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల డివిజన్ పరిశీలకులు రాజమౌళి, జూనియర్ అసిస్టెంట్లు కమలాకర్,రవి, ఆలయ అర్చకులు,దేవస్థాన సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.