హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి
మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్
మల్కాజిగిరి,(విజయక్రాంతి): ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటు కోల్పోయిన వారికి హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్(Malkajgiri Zonal Commissioner Sanchit Gangwar) సూచించారు. శనివారం ఆయన మల్కాజిగిరి మండల పరిధిలోని హియరింగ్ సెంటర్ లను తనిఖీ చేశారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులు, జారీ చేసిన నోటీసులు, వాటిపై చేపడుతున్న విచారణ తీరును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నోటీసులకు సంబంధించిన విచారణను క్షేత్రస్థాయిలో సమగ్రంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఓటర్ల వివరాలను నిర్ధారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులకు తావులేకుండా బూత్ స్థాయి అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ బూత్ స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.