స్థానిక పాత్రికేయులపై... బురద జల్లడం తగదు
- ప్రభుత్వ భూముల కబ్జాలతో ముడి పెడుతూ కించపరిచే కథనాలపై ఆగ్రహం.
- జవహర్ నగర్ పోలీసులకు స్థానిక పాత్రికేయుల ఫిర్యాదు.
- విచారణలో తప్పు తేలితే చర్యలు తప్పవు: ఎస్హెచ్ఓ సైదులు.
జవహర్ నగర్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): స్థానిక పాత్రికేయులపై బురద జల్లడం తగదని ప్రభుత్వ భూముల కబ్జాలతో(Encroachment of government lands) వారిని ముడి పెడుతూ కించపరిచే కథనాలు ప్రచురించడం తగదని స్థానిక పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ప్రభుత్వ భూముల కబ్జాల వ్యవహారంలో జవహర్ నగర్ స్థానిక విలేకరుల హస్తం ఉందంటూ ఆధారాలు చూపకుండా ఆరోపణలు చేయడం స్థానిక పాత్రికేయులను కించపరిచే కథనాలు ప్రచురించడం తగదని స్థానిక విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై నిష్పక్షపాత విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో స్థానిక పాత్రికేయులందరూ గురువారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా జవహర్ నగర్ లో ప్రభుత్వ భూముల కబ్జాల వెనుక స్థానిక పాత్రికేయుల హస్తం ఉందనే ఆరోపణలతో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.
దీనికి తోడు జవహర్ నగర్ లో సుమారు 200 మంది విలేకరులు ఉన్నారని వారిలో కొందరికి పెన్ను పేపర్ ఇస్తే సొంత పేరు కూడా రాయడం రాదని రీతిలో అవమానకర వ్యాఖ్యలు ప్రచురించడం స్థానిక విలేకరుల వృత్తిపరమైన గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కొన్ని పత్రికల్లో ఇటువంటి వ్యాఖ్యలతో కూడిన కథనాల ప్రతులను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నారు ఇలాంటి నిర్దిష్ట ఆధారం లేకుండా పాత్రికేయులందరినీ ఒకే ఘాటాన కట్టి కించపరిచేలా విష ప్రచారం చేయడం తగదన్నారు.
ఆధారాలుంటే బయటపెట్టాలి.
ప్రభుత్వ భూముల కబ్జాలో నిజంగా ఎవరైనా విలేకరుల ప్రమేయం ఉంటే వారి పేర్లతో పాటు సంబంధిత ఆధారాలను పోలీసులకు రెవెన్యూ అధికారులకు అందించాలని స్థానిక విలేకరులు స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిని రక్షించాల్సిన అవసరం తమకు లేదని తప్పు చేసిన వారు ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. అయితే కొందరిపై ఆరోపణలు ఉన్నాయని కారణంతో జవహర్ నగర్ లో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులందరినీ కబ్జాలతో ముడిపెట్టి వారి వృత్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.
తప్పుడు కథనాలపై తప్పు తేలితే చర్యలు: ఇన్స్పెక్టర్ సైదులు.
పాత్రికేయుల ఫిర్యాదు పై జవహర్ నగర్ ఎస్హెచ్ఓ సైదులు స్పందించారు ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించి ఎవరైనా నిర్దిష్ట ఆధారాలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందిన ఆధారాలను పరిశీలించి వాస్తవాల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆధారాలు లేకుండా వ్యక్తులను లేదా పాత్రికేయలను లక్ష్యంగా చేసుకొని వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఆరోపణలు, ప్రచారాలు మానాలని హెచ్చరించారు. పాత్రికేయులు ఇచ్చిన ఫిర్యాదు పై నిష్పక్షిపాతంగా విచారణ చేపడతామని విచారణలో ఎవరైనా చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలితే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ సైదులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.