జంక్‌ఫుడ్ వద్దు.. పోషకాహారమే ముద్దు..
జ్యోతి ప్రజ్వలన చేసి పోషకాహార మేళాను ప్రారంభించిన సర్పంచ్ పావని నరేందర్‌గౌడ్
పాపన్నపేట,అక్టోబర్08: జంక్‌ఫుడ్‌కు గుడ్‌బై.. పోషకాహారానికి వెల్‌కమ్ అంటూ విద్యార్థులు సందేశమిచ్చారు. తక్కువ ఖర్చుతో లభించే స్థానిక ఆహార పదార్థాలతోనే శరీరానికి అవసరమైన పోషకాలను అందించవచ్చని చాటి చెప్పారు. ఈ సందేశాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లేందుకు పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College) గురువారం నిర్వహించిన పోషకాహార మేళా ఆకట్టుకుంది.
కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 25 స్టాళ్లలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పోషక వంటకాలను ప్రదర్శించారు. స్థానిక సర్పంచ్ పావని నరేందర్‌గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కేవలం ఆకలి తీర్చుకోవడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా సమతుల ఆహారం తీసుకోవాలని సూచించారు.
జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం కంటే ఇంటి వద్ద లభించే పదార్థాలతో తక్కువ ఖర్చులోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తయారు చేసుకోవచ్చని తెలిపారు. పోషణ మాసం ముగింపు సందర్భంగా కూరగాయలతో బతుకమ్మ, బోనం ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో డీడబ్ల్యుఓ హేమ భార్గవి, సీడీపీఓ వెంకటరమణ, పాపన్నపేట సూపర్‌వైజర్లు, పోషణ మాసం కార్యక్రమ ఇన్‌చార్జి జి. శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.