క్రాప్ హాలిడే ప్రకటించాలి: సునీత లక్ష్మారెడ్డి
కొల్చారం, అక్టోబరు 24: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. పంటలు సాగు చేయలేని పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్‌తో కలిసి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి శనివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతులు అధిక ధరలు చెల్లించి ధాన్యం కొనుగోలు చేస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ధర చెల్లించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రైతులకు అండగా బీఆర్‌ఎస్ పార్టీ నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస చారి, వ్యవసాయ శాఖ ఏడీ పుణ్యవతి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాంపల్లి శంకర్ గుప్తా, మండల యువజన విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్ రావు, సంతోష్ , ఏఎంసీ మాజీ డైరెక్టర్ కరెంటు రాజా గౌడ్, గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు దుర్గప్రసాద్ గౌడ్, మాజీ ఉపసర్పంచులు చౌరిగారి చిన్న రాములు, ఎండుగల కృష్ణ, చెన్నయ్య, వార్డు సభ్యులు చింతల కృష్ణ, నేరెళ్ల సత్యనారాయణ, సాతెల్లి షేకులు, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, గిర్దావర్ సుమలత, సొసైటీ సీఈఓ కృష్ణ. ఆరే రవీందర్. తదితరులు పాల్గొన్నారు.