నాసిరకం సరుకుల సరఫరాపై విచారణ జరపాలి
- నాకాఫ్ టెండర్ రద్దు చేయాలి
- విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు(Government welfare hostels) నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న నాకాఫ్ సంస్థ టెండర్‌ను(Nakaf Organization Tender) రద్దు చేయాలని విద్యార్థి జన సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాలోని కేజీబీవీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, ఇతర సంక్షేమ హాస్టళ్లకు నాకాఫ్ సంస్థ ద్వారా సరుకులు సరఫరా చేస్తున్నారని తెలిపారు.
అయితే విద్యార్థులకు అందించాల్సిన 30 రకాల సరుకులకు బదులుగా 15 రకాలే పంపిణీ చేస్తున్నారని, సరుకుల్లో నాణ్యత లోపించడంతోపాటు పుచ్చులు పట్టడం, పురుగులు ఉండటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపించారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ సరుకుల సరఫరాలో నాణ్యత పాటించకపోవడం విచారకరమన్నారు. నాసిరకం సరుకుల కారణంగా హాస్టల్ వార్డెన్లు, హెచ్‌ఎంలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సరుకుల నాణ్యతపై సమగ్ర విచారణ జరిపించాలని, సరఫరాలో అవకతవకలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుత నాకాఫ్ సంస్థ టెండర్‌ను రద్దు చేసి, కొత్త టెండర్లు పిలిచి నాణ్యమైన సరుకులు సరఫరా చేసే సంస్థకు బాధ్యతలు అప్పగించాలని కోరారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం కొనసాగితే విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.