బాలికను మాయమాటలతో తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు
మెదక్ జిల్లా ఎస్పీ. డి. వి. శ్రీనివాస రావు
చేగుంట అక్టోబర్ 27: బాలికను మాయమాటలతో నమ్మించి వెంట తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు(POCSO court) తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. 8వ తరగతి చదువుతున్న బాలికను ఆమె తండ్రి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కించారు. అయితే, వడియారం వద్ద బస్సు ఆగకపోవడంతో బాలిక చేగుంటలో దిగింది.
ఈ క్రమంలో తనకు పరిచయమున్న ఆనంద్ (22) అనే యువకుడికి ఫోన్ చేసి, తాను చేగుంటలో ఉన్నానని, తనను హాస్టల్ వద్ద దింపాలని కోరింది. అక్కడికి చేరుకున్న ఆనంద్ మాయమాటలు చెప్పి, తనతో ఉంటే బాగా చూసుకుంటానని నమ్మించి బాలికను వెంట తీసుకెళ్లాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభవల్లి నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించారు.